కేసీఆర్ సవాల్ ను స్వీకరించిన కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రజలు బానిసలుగా ఉంటూ తనకు జీహుజూర్ అనాలని కేసీఆర్ భావిస్తున్నారని.. ఎవరు ఎదిరించినా, వ్యతిరేకించినా సహించలేకపోతున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంగళవారం నాంపల్లిలోని భాజపా రాష్ట్రకార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాతి రోజు నుంచి సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం, మేధావులు అర్థం చేసుకోవాలని కోరారు.
కేసీఆర్ మాట్లాడుతున్న భాష దిగజారుడుతనంగా ఉంది. ప్రధాని మోదీ, భాజపాపై అవాస్తవాలతో విషం కక్కుతున్నారు. బెదిరింపులు, రెచ్చగొట్టే విధానాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్రానికి, భాజపాకు ఎవరూ శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమే. దేశ సమైక్యత, సమగ్రతను దెబ్బతీసేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. అమరుల ఆత్మలు ఘోషించేలా.. భారత సైనికుల స్థైర్యం దెబ్బతినేలా సీఎం మాట్లాడారు. భారత జవాన్ల దాడిలో పాక్ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి.
తమ స్థావరాల ధ్వంసాన్ని పాక్ ఉగ్రవాదులూ అంగీకరించారు. తండ్రి తర్వాత కుమారుడు పాలించేలా నిజాం తరహాలో రాచరిక పాలన మళ్లీ రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం ఏడేళ్ల పాలనపై కేసీఆర్‌తో చర్చకు సిద్ధం. సీఎం కేసీఆర్ సవాల్‌ను కేంద్ర ప్రభుత్వం తరఫున స్వీకరిస్తున్నా. సీనియర్ పాత్రికేయుల సమక్షంలో గన్‌పార్కు వద్దకు రావాలని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు.