అహ్మదాబాద్‌ పేలుళ్లు.. 38 మందికి ఉరి శిక్ష

14 యేళ్ల క్రితం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగిన కేసులో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే 49 మందిని దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. వారికి శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. దోషుల్లో 38 మందికి మరణ శిక్ష.. మిగతా 11 మందికి జీవిత ఖైదు విధించింది.

2008 జులై 26న అహ్మదాబాద్‌ నగరంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 70 నిమిషాల వ్యవధిలో 21 బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం 56 మంది అమాయక ప్రజలు చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు.

ఈ కేసుకు సంబంధించి గత ఏడాది సెప్టెంబరులో విచారణ ముగియగా వీరిలో 49 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తాజాగా శిక్షను ఖరారు చేసింది. ఏకంగ 38 మందికి ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.