రివ్యూ : భీమ్లా నాయక్

చిత్రం : భీమ్లా నాయక్

నటీనటులు : పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సముద్రఖనీ తదితరులు

సంగీతం : థమన్

మాటలు-స్క్రీన్ ప్లే : త్రివిక్రమ్

దర్శకత్వం : సాగర్ కె చంద్ర

బ్యానర్ : సితార ఎంటర్ టన్ మెంట్స్

రిలీజ్ డేట్ : 25, ఫిబ్రవరి, 2022.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గర్జిస్తే.. బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. ఆయన మేనరిజం పండితే.. అభిమానులకు పూనకాలే. ఈ రెండు పండిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టింది. సరిగ్గా అంతటి ఎనర్జితో పవన్ నటించిన చిత్రం భీమ్లా నాయక్ అని చిత్రబృందం ముందు నుంచి చెబుతూ వస్తుంది. టీజర్, ట్రైలర్ ను చూస్తే అది నిజమే అనిపించింది. మరీ.. సినిమాలో పవన్ గర్జన ఏ రేంజ్ లో ఉంది. అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

ఇదో ఈగో క్లాష్‌. గోటితో పోయిందానికి, ఈగోకి పోయి గొడ్డ‌లి వ‌ర‌కూ తెచ్చుకున్న ఓ అహంకారి క‌థ‌. డానియ‌ల్ శేఖ‌ర్ (రానా) మాజీ మిల‌ట‌రీ ఉద్యోగి. రాజ‌కీయ ప‌లుకుబ‌డి ఉన్న వ్య‌క్తి. క‌ర్నూలు స‌రిహ‌ద్దుల్లోని చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర ఎస్‌.ఐ భీమ్లా నాయ‌క్ (ప‌వ‌న్ క‌ల్యాణ్‌) అరెస్ట్ చేస్తాడు. కేసు ఫైల్ చేసి, ఎఫ్‌.ఐ.ఆర్ కూడా రాస్తారు. కానీ.. డానియ‌ల్ బ్యాక్ గ్రౌండ్ తెలిశాక‌.. భీమ్లా కాస్త త‌గ్గుతాడు. అదే అదునుగా తీసుకుని డానీ రెచ్చిపోతాడు. సీజ్ చేసిన మందు బాటిల్ ని, డాని కోసం ఓపెన్ చేయ‌బోయి, కెమెరాకి చిక్కుతాడు నాయ‌క్‌. ఆ వీడియో పై అధికారుల‌కు పంపించి, భీమ్లా స‌స్పెండ్ అయ్యేలా చేస్తాడు డానీ. అలా ఓ చిన్న గొడ‌వ‌.. చినికీ చినికీ గాలివాన‌గా మారుతుంది. భీమ్లా, డానీల మ‌ధ్య యుద్ధం మొద‌ల‌వుతుంది. ఈ యుద్ధంలో ఎవ‌రు గెలిచారు? ఎవ‌రు ఓడారు? అనేదే మిగిలిన క‌థ‌.

ఎవరెలా చేశారు :

డానీ, భీమ్లా అనేవి రెండు బ‌ల‌మైన పాత్ర‌లు. ఒక‌రిది అహం అయితే, మ‌రొక‌రిది ఆత్మాభిమానం. రెండూ త‌గ్గేవి కావు. అందుకే ఆ పోటీ మ‌జానిస్తుంది. రెండు కొద‌మ సింహాలు త‌ల‌బ‌డితే ఎలా ఉంటుందో ఈసినిమా అలా ఉంటుంది. ప‌వ‌న్ చాలా ఎన‌ర్జిటిక్ గా క‌నిపించాడు. గబ్బ‌ర్ సింగ్ త‌ర‌వాత ప‌వ‌న్ లో ఇంత ఎన‌ర్జీ చూడ‌డం ఇదే తొలిసారి. డానియల్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి నెక్ టు నెక్ పర్ ఫామెన్స్ ఇచ్చాడు. మాతృక ‘అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌’ లో పెద్దగా మార్పులు చేయలేదు. కానీ పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. పవన్ నుంచి ఆయన అభిమానులు ఏం ఆశిస్తారో.. అవన్నీ ఉండేలా పక్కగా ప్లాన్ చేసి.. తీసుకొచ్చారు. భీమ్లా భార్య పాత్రలో నిత్యా మీనన్ బాగా నటించింది. థమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని మరింత పెంచింది. త్రివిక్రమ్ మాటలు ఎప్పటిలాగే బాగా పేలాయి. దర్శకుడు సాగర్ కె చంద్ర టేకింగ్ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

కథ-కథనం

పవన్, రానాల నటన

థమన్ సంగీతం

యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

పెద్దగా లేవనే చెప్పాలి.

సాంకేతికంగా :

టెక్నికల్ గా సినిమా పైస్థాయిలో ఉంది. అన్నిటికంటే మించి థమన్ మ్యూజిక్ సినిమాని పూర్తిగా నిలబెట్టేసింది. వాస్తవానికి ఫ్లో డౌనవడానికి, ల్యాగ్ ఉందని అనిపించడానికి చాన్సున్న సన్నివేశాలు కొన్నున్నాయి. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆ ఫీలింగ్ రాకుండా దాటేసిన పనితనానికి తమన్ ని మెచ్చుకుని తీరాలి. పవన్ కళ్యాణ్, రానాతో పాటు ఈ సినిమాలో కనిపించకుండా వినిపించే మూడో పెద్ద హీరో తమన్. కెమెరా, ఎడిటింగ్ విభాగాలు ఒరిజినల్ ని బెంచ్ మార్క్ గా తీసుకుని ఫాలో అయిపోయాయి.

బాటమ్ లైన్ : భీమ్లా నాయక్.. బ్లాక్ బస్టర్

రేటింగ్ : 4/5