తెలంగాణలో ఉద్యోగాల జాతర

నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 పోస్టుల్లో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. శాఖల వారీగా ఖాళీలను సభలో చదివి వినిపించారు సీఎం కేసీఆర్. హోంశాఖలో 18,334 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 13,086, వైద్యారోగ్య- కుటుంబ సంక్షేమ శాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, బీసీ సంక్షేమశాఖలో 4,311 పోస్టులను భర్తీ చేయనున్నారు.

రెవెన్యూ శాఖలో 3,560, ఎస్సీల అభివృద్ధి శాఖ 2,879, నీటిపారుదల- కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ 2,692, గిరిజన సంక్షేమశాఖ 2,399, మైనార్టీ సంక్షేమశాఖ 1,825, అటవీ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 1,598, పంచాయతీరాజ్‌- గ్రామీణాభివృద్ధి శాఖ 1,455, కార్మిక-ఉపాధి కల్పన శాఖలో 1,221 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. ఆర్థికశాఖలో 1,146 పోస్టులు.. స్త్రీ, శిశు సంక్షేమశాఖ 895, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 859, వ్యవసాయ-సహకార 801, ట్రాన్స్‌పోర్ట్‌- ఆర్‌అండ్‌బీ శాఖ 563, న్యాయశాఖ 386, పశుసంవర్థక, మత్స్యశాఖ 353, సాధారణ పరిపాలన శాఖ 343, పరిశ్రమలు-వాణిజ్యశాఖ 233, యువజన సర్వీసులు-పర్యాటక, సాంస్కృతిక శాఖ 184, ప్రణాళిక శాఖ 136, పౌరసరఫరాల శాఖ 106, లెజిస్లేచర్‌ 25, ఎనర్జీ 16 పోస్టులు.. ఇలా మొత్తం 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు  సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.