రివ్యూ : రాధేశ్యామ్ – క్లాస్ హిట్
చిత్రం : రాధేశ్యామ్
నటీనటులు : ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, జగపతిబాబు, భాగ్యశ్రీ, సచిన్ఖేడ్కర్, ప్రియదర్శి తదితరులు
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ)
నేపథ్య సంగీతం : థమన్
దర్శకత్వం : కె కె రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు : వంశీ, ప్రమోద్, ప్రసీధ
రిలీజ్ డేట్స్ : 11 మార్చి, 2022
భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో దాదాపు రూ 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ప్రేమకథ రాధేశ్యామ్. ప్రేమకీ, విధికీ మధ్య సంఘర్షణ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాల్ని పెంచాయి. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ‘రాధేశ్యామ్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. రాధేశ్యామ్ ఎలా ఉంది ? ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టు ఉందా ? పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుందా ? అసలు రాధేశ్యామ్ కథ ఏంటీ ? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.
కథ :
పేరు మోసిన జ్యోతిషుడు విక్రమాదిత్య (ప్రభాస్). ఇటలీలో నివసిస్తుంటాడు. హస్త సాముద్రికంలో ఆయన అంచనాలు వందశాతం నిజమవుతుంటాయి.తన చేతిలో ప్రేమ రేఖ లేదని తెలుసుకున్న ఆయన తన జీవితం గురించి కూడా ఓ స్పష్టమైన అంచనాతో ఉంటాడు. అనుకోకుండా ప్రేరణ (పూజాహెగ్డేని కలుస్తాడు విక్రమాదిత్య. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ, ప్రేమించలేని పరిస్థితి. మరి విధి ఆ ఇద్దరినీ ఎలా కలిపింది ? వాళ్ల జీవితాల్లో జరిగిన సంఘర్షణ ఎలాంటిదనేది మిగతా కథ.
ఎలా ఉంది ?
మన రాత మన చేతుల్లో లేదు, చేతల్లో ఉంటుందనే విషయాన్ని ఓ ప్రేమకథతో ముడిపెట్టి చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. దాన్నే విజువల్ ట్రీట్ గా తీసుకొచ్చారు. జ్యోతిషం ఒక శాస్త్రం అని చెబుతూనే… మన రాతని మనమే రాసుకోవచ్చని చెప్పిన తీరులో చాలా స్పష్టత ఉంది. ప్రభాస్ ఇమేజ్ కోసం మాస్ అంశాలను ఏమీ జోడించలేదు. కథని నమ్మి చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. మొత్తంగా క్లాస్‌గా సాగే ఓ ప్రేమకథ ఇది. తన ఇమేజ్ నుంచి బయటికొచ్చి విక్రమాదిత్య పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశారు ప్రభాస్. ప్రేమకథల్లో నాయకానాయికల జోడీనే కీలకం. ఇందులో కూడా అంతే. ప్రభాస్, పూజా జోడీ అందంగా కనిపించింది. అయితే ఎమోషన్స్ ఇంకా పండాల్సి ఉంది. క్లాస్ సినిమాలు, ప్రభాస్ ఫ్యాన్స్ కు రాధేశ్యామ్ నచ్చుతుంది. కానీ ప్రభాస్ నుంచి కేవలం మాస్ కోరుకునే ప్రేక్షకులకు ఈ ప్రేమకథ బోర్ కొట్టవచ్చు.
సాంకేతికంగా :
టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా రవీందర్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఈ సినిమాని మరోస్థాయిలో నిలబెట్టింది. సినిమాకి ప్రధాన బలం ఆర్ట్ విభాగమే. మనోజ్ పరమహంస కెమెరా. యూరప్ నేపథ్యంలో ఈ సినిమా సాగడం విజువల్‌గా కలిసొచ్చిన విషయం. సంగీతం బాగుంది. ‘ఎవరో నీవెవరో’, ‘ఛలో ఛలో’ పాటలు తెరపై చూడ్డానికి బాగున్నాయి. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మొదటి 20 నిమిషాలు ట్రాన్స్ లోకి తీసుకెళ్లాడు. ఓ అద్భుతమైన దృశ్యకావ్యం చూడబోతున్నమాని ఫీలింగ్ కలిగింది. సినిమాని నిలబెట్టి అంశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి.
ప్లస్ పాయింట్స్ :
ప్రభాస్, పూజా హెగ్డే
జ్యోతిష్యం కథాంశం
విజువల్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
ఎమోషన్స్
స్లో నేరేషన్
మాస్ అంశాలు మిస్ అవ్వడం
బాటమ్ లైన్ : రాధేశ్యామ్ : క్లాస్ ప్రేమకథ
రేటింగ్ : 3/5