ముందస్తుకు పోయే ప్రసక్తే లేదు

తెలంగాణ ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పులిస్టాప్ పెట్టారు. ఆరునూరైనా ముందస్తుకు పోయే ప్రసక్తే లేదు. గతంలో అవసరం మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ జరిగింది. సమావేశానికి తెరాస ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై తెరాస శాసనసభాపక్ష సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

భేటీ అనంతరం తెలంగాణ భవన్‌ నుంచి శాసనసభాపక్ష భేటీ వివరాలను సీఎం కేసీఆర్‌ మీడియాకు వివరించారు. ముందస్తుకు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈసారి మేం 95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం. 3 సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయి. 30 స్థానాలకు గాను 29 స్థానాల్లో తెరాస గెలుస్తుందని నివేదిక ఇచ్చాయి. 0.3 శాతం తేడాతో ఒక స్థానం కోల్పోతామని నివేదిక వచ్చింది. నివేదిక ఆధారంగా 119 స్థానాలకు గాను 4 స్థానాలు కోల్పోతామని తెలుస్తోంది. మరో 25 రోజుల్లో నివేదిక బహిర్గతం చేస్తామని కేసీఆర్ తెలిపారు.