ఇండియన్ సినిమాపై సౌత్ ఆధిపత్యం

ఈవారం తెలుగు సినిమా ఒక్క‌టీ విడుద‌ల కావ‌డం లేదు. వ‌చ్చేవి రెండూ డ‌బ్బింగు బొమ్మ‌లే. ఒక‌టి బీస్ట్ అయితే మ‌రోటి కేజీఎఫ్ 2. తెలుగులోనూ బీస్ట్ భారీ సంఖ్య‌లో థియేట‌ర్ల‌కు సంపాదించుకుంది. తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాకి ఎంత పెద్ద ఓపెనింగ్ ఉండ‌బోతోందో, దానికి కొంచెం కూడా త‌గ్గ‌కుండా… విజ‌య్ సినిమా ప్ర‌భావం చూపించే ఛాన్స్ ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు గ‌డుతున్నాయి.

14న కేజీఎఫ్ 2 సినిమా విడుద‌ల అవుతోంది. ఇది కన్న‌డ సినిమానే అయినా – అస‌లు సిస‌లు పాన్ ఇండియా సినిమా. కేజీఎఫ్ 1 దేశ వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. బాహుబ‌లి త‌ర‌వాత‌ ఆ స్థాయిలో బాలీవుడ్ ని షేక్ చేసిన సినిమా ఇది. ఇప్పుడు కేజీఎఫ్ 2పై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఓపెనింగ్ డేన‌.. కొత్త రికార్డులు సృష్టించే స‌త్తా కేజీఎఫ్ 2కి ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఈ రెండు డబ్బింగ్ సినిమాలకు..  స్ట్ర‌యిట్ సినిమా రేంజ్ లో  మైలేజీ ఉండనుంది.  ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌బ‌డి, గ‌ట్టిగా వ‌సూళ్లు సాధించిన సినిమా ఏదీ రాలేదు. ఈ రెండింటికీ ఆ ఆస్కారం ఉంది. రెండూ భారీ వ‌సూళ్ల‌తో హోరెత్తిపోయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ లోనూ సత్తా చాటితే..  పాన్ ఇండియా సినిమాపై సౌత్ ఆధిపత్యం కొనసాగినట్టే.