సల్మాన్ కోసం హరీష్, ప్రభాస్ కోసం పరశురామ్

టాలీవుడ్, బాలీవుడ్ మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా సినిమా రాజ్యమేలుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రమే కాదు.. టాప్ డైరెక్టర్స్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. సల్మాన్ కోసం హరీష్ ఓ లైన్ అనుకున్నాడు. అది ఓకే అయితే.. వెంటనే స్కిప్ట్ పనులు మొదలు పెట్టే ఆలోచనలో హరీష్ ఉన్నట్టు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో ఓ కీలక పాత్రలో సల్మాన్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఒకట్రెండు సార్లు హైదరాబాద్ కి వచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా సల్మాన్ తో సినిమా గురించి హరీష్ చర్చించి ఉంటారని అంటున్నారు. సల్మాన్ దబాంగ్ సినిమాను హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ రిమేక్ చేశారు. గబ్బర్ సింగ్ కోసం చేసిన మార్పులు బాగున్నాయని అప్పట్లో సల్మాన్ కితాబిచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే సల్మాన్ దృష్టిలో మొదటిసారి హరీష్ పడ్డారు. మంచి స్కిప్ట్ తో వస్తే సినిమా చేసేందుకు సల్మాన్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చేసేందుకు దర్శకుడు పరశురామ్ ప్రయత్నాలు షురూ చేసినట్టు తెలిసింది. ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకొని ఓ కథ రాయడానికి రెడీ అవుతున్నాడు పరశురామ్. ఎప్పట్నుంచో తన మనసులో ఉన్న పాయింట్ ను ప్రభాస్ మేనరిజమ్స్, ఇమేజ్ కు తగ్గట్టు కథగా మార్చాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. కుదిరితే ఈ గ్యాప్ లోనే ప్రభాస్ కు స్టోరీలైన్ వినిపించాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ప్రభాస్ కనుక ఓకే చెబితే.. అదే లైన్ పై పూర్తిస్థాయిలో వర్క్ మొదలు పెట్టాలనేది ఆలోచనలో పరశురామ్ ఉన్నట్టు తెలుస్తోంది.