డ్రగ్స్ కేసు : ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్
ముంబయి తీరంలోని ఓ క్రూజ్ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం.. అదే నౌకలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఉండటం గతేడాది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ.. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
ఈ కేసులో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ అక్టోబరు 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అక్టోబరు 29న ఆర్యన్‌కు బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్.. అక్టోబరు 30న బెయిల్‌పై విడుదలయ్యాడు.
అయితే ఆర్యన్, మోహక్ ఇద్దరు మినహా మిగతా అందరి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు తొలుత అధికారులు గుర్తించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన సిట్.. 14 మంది నిందితులపై కేసు నమోదు చేసింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆర్యన్ సహా మరో ఆరుగురిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఈ కేసులో ఎన్సీబీ నేడు కోర్టుకు ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 6వేల పేజీల ఈ ఛార్జ్‌షీట్‌లో 14 మందిపై అభియోగాలు మోపింది. ఆర్యన్‌ఖాన్‌తో పాటు మరో ఆరుగురి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని ఎన్సీబీ వెల్లడించింది. దీంతో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చీట్ లభించింది. ఆయన తండ్రి సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ అయింది.