కాంగ్రెస్‌పై నగ్మ ఫైర్
వచ్చే నెల 10వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం పది మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కీలక నేతలను పక్కనబెట్టి బయటివారికి అవకాశం ఇవ్వడంపై కొందరు నాయకులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పార్టీ నాయకురాలు, నటి నగ్మ ట్విటర్ వేదికగా కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు.
“నా 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు తక్కువైంది. 2003-04లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు స్వయంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే నన్ను రాజ్యసభకు పంపుతానని మాటిచ్చారు. అప్పటి నుంచి ఈ 18 ఏళ్లలో వారు నాకు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్‌ను ఎంపిక చేశారు. ఆ పదవికి నేను తక్కువ అర్హురాలినా?” అంటూ నగ్మ కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆదివారం పది మంది అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని తమిళనాడు నుంచి రంగంలోకి దింపింది. పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, ఉత్తర్‌ప్రదేశ్ నేత ప్రమోద్ తివారీలను రాజస్థాన్ నుంచి పోటీకి నిలిపింది. కర్ణాటక నుంచి జైరాం రమేశ్‌కు, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ టంకాలకు అవకాశం కల్పించింది. వీరితోపాటు రాజీవ్ శుక్లా (ఛత్తీస్‌గఢ్), మాజీ ఎంపీ పప్పూ యాదవ్ సతీమణి రంజీత్ రంజన్ (బిహార్), అజయ్ మాకెన్ (హరియాణా), ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి (మహారాష్ట్ర)లను బరిలోకి దింపింది. ఇందులో చిదంబరం, జైరాం రమేశ్, వివేక్ టంకాలు మాత్రమే వారి సొంత రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు.