ఇంగ్లాండ్’లో భారత్.. బోణీ ఘనం !

ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌లో కోహ్లీసేన ఘనంగా బోణీ కొట్టింది. బంతితో కుల్‌దీప్‌ యాదవ్‌ (5/24), బ్యాటుతో కేఎల్‌ రాహుల్‌ (101 నాటౌట్‌; 54 బంతుల్లో 10×4, 5×6) చెలరేగడంతో 8 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై ఘనవిజయం సాధించింది.

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టాస్‌ గెలిచిన.. ఇంగ్లాండ్‌కే బ్యాటింగ్‌ అప్పగించాడు. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (30), బట్లర్‌ రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్‌ తొలి 4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 44 పరుగులు సాధించింది. ఐతే, 5 ఓవర్ల తర్వాత ఆట భారత్ నియంత్రణలోకి వచ్చింది. టైట్ బౌలింగ్‌, ఆ తర్వాత టపా టపా వికెట్లు పడటంతో ఇంగ్లాండ్ స్కోర్ 159కే పరితమైంది.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభంలోనే ఓపెనర్ ధావవ (4) వికెట్ ని పోగొట్టుకొంది. రాహుల్‌ కళ్లు చెదిరే షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రాహుల్ ఆట చూస్తే ఒకే సమయంలో రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెవ్వాగ్ ఆటని చూసినట్టు అనిపించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో టీ20 శుక్రవారం జరుగుతుంది.