రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీరాజ్‌

దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత మహిళల క్రికెట్‌కు సేవలందించిన మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ క్రీడా దిగ్గజం ఓ లేఖను విడుదల చేశారు. ఇన్నేళ్లు జట్టుకు నాయకత్వం వహించడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఏళ్ల పాటు సాగిన తన క్రికెట్‌ ప్రస్థానానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసిందని మిథాలీ తన వీడ్కోలు లేఖలో పేర్కొన్నారు.

భారత్‌లో మహిళా క్రికెట్‌కు ప్రాణం పోసిన స్టార్‌ క్రికెటర్‌, మిథాలీరాజ్‌ 232 వన్డేల్లో 7శతకాలు, 64అర్ధశతకాలతో 7805 పరుగులు చేశారు. 89 టీ20ల్లో 2364పరుగులు చేయగా.. అందులో 17 అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే, 12 టెస్టుల్లో ఒక శతకం, నాలుగు అర్ధ శతకాలతో 699 పరుగులు చేశారు. 1999 జూన్‌ 26న తన తొలి మ్యాచ్‌ ఆడిన మిథాలీ.. 2022 మార్చి 27న చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడారు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులను తన పేరున లిఖించుకున్నారు.