కైతలాపూర్‌ బ్రిడ్జి ప్రారంభం

కూకట్‌పల్లి పరిధిలోని కైతలాపూర్‌ వద్ద రూ.84 కోట్లతో నిర్మించిన ప్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు. ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌-1లో భాగంగా రూ.8,052 కోట్లతో 47 కార్యక్రమాలు చేపట్టామన్నారు. రూ.3,115 కోట్లతో రెండో దశ ఎస్‌ఆర్‌డీపీ పనులు చేపట్టినట్లు చెప్పారు. హైదరాబాద్‌ నగరాభివృద్ధికి సూచిక రహదారులు, ప్రజా రవాణా వ్యవస్థేనని కేటీఆర్‌ అన్నారు. నగరంలో ఈ 8 ఏళ్లలో తెరాస ప్రభుత్వం 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని.. మరో 17 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.

ఈ సందర్భంగా కేంద్రంపై తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. చేతనైతే రక్షణ రంగానికి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించండి. కంటోన్మెంట్‌ ప్రాంతంలోనూ అద్భుతంగా ఫ్లైఓవర్‌లు, స్కైవేలు కడతాం. హైదరాబాద్‌ అంటే దేశంలోనే అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉన్న నగరంగా తీర్చిదిద్దుతాం. ఆ బాధ్యత మాది. చేతనైతే సహాయం చేయండి తప్ప మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవద్దని హితువు పలికారు. ఐడీపీఎల్‌  లో  రోడ్లు ఎలా వేస్తారని హైదరాబాద్‌కు చెందిన ఓ కేంద్రమంత్రి అంటున్నారు. మీరు కొత్తగా కనీసం పైసా పనిచేయరు. కానీ పోలీసు కేసులు పెట్టాలని ఆదేశాలిస్తున్నారు. మీకు దమ్ముంటే.. చేతనైతే మున్సిపల్‌ మంత్రిగా తనపై, రాష్ట్ర ప్రభుత్వంపై కేసులు పెట్టండని సవాల్ విసిరారు