NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఖరారయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముర్ము పేరును అధికారికంగా ప్రకటించారు. దాదాపు 20మంది పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ.. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో ద్రౌపది ముర్ము జన్మించారు. టీచర్‌గా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాారు. ఆ తర్వాత రాయ్‌రంగపూర్ నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. తర్వాత రెండు పర్యాయాలు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికైన ఆమె.. బీజేపీ- బిజూ జనతాదళ్ కలిసి ఏర్పాటుచేసిన నవీన్ పట్నాయక్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో 2000- 2004 మధ్య మంత్రిగా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు ఝార్ఖండ్ గవర్నర్‌గా సేవలందించారు.
2017 రాష్ట్రపతి ఎన్నికల్లో ఈమె పేరు ప్రధానంగా చర్చకు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో బిహార్ గవర్నర్‌గా ఉన్న ఎస్సీ నేత రామ్‌నాథ్ కోవింద్ పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే.