శిందే శిబిరంలో 40 మంది ఎమ్మెల్యేలు ?

 మహా’ రాజకీయం ఇప్పుడు అస్సాంకు చేరుకుంది. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్‌నాథ్‌ శిందే తన అనుచరులతో కలిసి అస్సాం చేరుకున్నారు. గువాహటి నగర శివారులో ఉన్న రాడిసన్‌ బ్లూ హోటల్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఇక గువాహటి ఎయిర్‌పోర్టు వద్ద శిందే మీడియాతో మాట్లాడారు. తనకు 40 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వర్గం చీలిపోదని చెప్పారు. మరో ఆరుగురు స్వతంత్రులు కూడా తనకు మద్దతిస్తున్నారని అన్నారు. త్వరలోనే తాము గవర్నర్‌ను కలవాలనుకుంటున్నట్లు శిందే తెలిపారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్ కోశ్యారీ కరోనా బారినపడ్డారు. ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.