నాగం బిరుదుల లిస్టు చదివిన ఎమ్మెల్సీ కర్నె..!!
దంచుకో ,దోచుకో ,దాచుకో అంటూ టీఆర్ఎస్ వైఖరిపై విరుచుకుపడ్డ నాగంకు ఆ పార్టీనేతలు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలోనే మొదలైందన్న నాగం కామెంట్స్ పై ఆయన కాస్త జ్ఞానం పెంచుకుంటే మంచిదంటూ విమర్శించారు టీఆర్ఎస్ నేతలు. ఇక ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఒకడుగు ముందుకేసీ నాగం బిరుదుల లిస్టు చదివి చెప్పారు.
నాగంకు ఆగం రెడ్డి ,బియ్యం రెడ్డి అని ఇప్పటికే బిరుదులు ఉన్నాయని, ఇపుడు అబద్ధాల రెడ్డి గా కూడా పేరు తెచ్చుకుంటున్నారంటూ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తన సహజ ధోరణితో నాగం గాంధీ భవన్ లో కాంగ్రెస్ ను తిట్టి నాలుక కరుచుకున్నారన్నారు. నాగం కాంగ్రెస్ కు భారమే తప్ప ఉపయోగం కాదని, ఈ విషయం త్వరలోనే తేటతెల్లమవుతుందని చెప్పారు. సీఎం కెసిఆర్ ,మంత్రి హరీష్ రావు ల పై నాగం నీచాతి నీచమైన ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు కర్నె.
వై ఎస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాగం ఇపుడు ఆయన్ను పొగడడం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ దే అయితే కాంగ్రెస్ నేతలే ఎందుకు కేసులు వేశారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సర్వత్రా ప్రశంసలు వస్తుంటే, నాగంలాంటి వారు ఓర్చుకోలేక పోతున్నారని,
నాగం తీరు మార్చుకోకుంటే కబడ్ధార్ అంటూ హెచ్చరించారు.