అలియా భట్ కాపురంలో అప్పుడే కలతలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కాపురంలో అప్పుడే కలతలు ఏర్పడ్డాయి. దానికి గల కారణాలు తెలియాలంటే ‘డార్లింగ్స్’ సినిమా చూడాల్సిందే. అలియా ప్రధాన పాత్రలో ‘రెడ్ చిల్లీస్’ పతాకంపై తెరకెక్కుతున్న కామెడీ-డ్రామా చిత్రం ‘డార్లింగ్స్’. జస్మీత్ కె రీన్ దర్శకురాలు. గౌరీఖాన్, అలియా భట్, గౌరవ్‌వర్మలు నిర్మిస్తున్నారు. షెఫాలీ షా, విజయ్‌వర్మ, రోషన్ మ్యాథ్యూ.. కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 5న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది.
మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో విజయ్.. అలియా వెంట పడటంతో ట్రైలర్ మొదలవుతుంది. అష్టకష్టాలు పడి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వీరి మధ్య మూడో వ్యక్తి రోషన్ ప్రవేశించడంతో వాళ్ల కాపురంలో కలతలు, అనుమానాలు మొదలవుతాయి. ఈ చిక్కుముళ్ల నుంచి బయట పడటానికి అలియా తన తల్లి షెఫాలీతో కలిసి పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరగడం.. కప్ప, తేలు కథ చెప్పడం.. ఆసక్తికరంగా సాగింది ట్రైలర్.