ఎంపీ అర్వింద్‌ ను అడ్డుకున్న గ్రామస్థులు.. వాహనాలు ధ్వంసం !

అధికార పార్టీ నేతలే కాదు.. ప్రతి పక్ష నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి తెలంగాణలో లేదు. ఎన్నికల టైమ్ లో క్యూ కడుతున్న నేతలను గ్రామస్థులు నిలదీస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రజల ఆగ్రహానికి గురైన అధికార పార్టీ నేతల పరిస్థితి చూశాం. తాజాగా ఎంపీ అరవింద్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు చేదు అనుభవం ఎదురైంది. గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన ఎంపీని గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామనికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ ఆయన్ను నిలదీశారు. మరోవైపు ఆ సమయంలో తమపై భాజపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపించారు. దీంతో తిరుగు పయనమైన అర్వింద్‌ను మరోసారి వారు అడ్డుకున్నారు. ఆగ్రహానికి గురైన గ్రామస్థులు.. కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో రెండు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. మొత్తానికి పోలీసుల ప్రొటెక్షన్ మధ్య అరవింద్ తిరుగు పయనం అయ్యారు.