ఈ నెల 26 నుంచి స్పెక్ట్రమ్‌ వేలం

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే 5జీ టెక్నాలజీలోకి భారత్ అడుగిడబోతోంది. దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ జులై 26న ప్రారంభం కాబోతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన కొన్ని నెలల్లోనే దేశంలో అత్యంత వేగవంతమైన టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయి. 5జీ కోసం ప్రస్తుతం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్జ్‌ స్పెక్ట్రాన్ని వేలానికి ఉంచనున్నారు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz , 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు వేలం నిర్వహించనున్నారు.

భవిష్యత్‌లో దేశంలో రాబోయే సాంకేతిక పరిజ్ఞానం. 4జీ కంటే కొన్ని రెట్ల వేగంతో ఇంటర్నెట్‌ పనిచేస్తుంది. 4జీలో ఒక సినిమా డౌన్‌లోడ్‌ కావాలంటే కొన్ని నిమిషాలు పడితే.. ఇందులో రెప్పపాటులోనే అల్ట్రా హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే వీఆర్‌, ఏఆర్‌ సాంకేతికతలో వేగం పెరగనుంది. భద్రతతో కూడిన రవాణా వ్యవస్థ, రిమోట్‌ ప్రాంతాలకు ఆరోగ్యసేవలు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, సరకు రవాణాలో డిజిటల్‌ సేవలు వంటి ఎన్నో అంశాల్లో 5జీ కీలకం కానుంది. రిమోట్‌ ఆధారిత సేవలు అందుబాటులోకి నున్నాయి.