రాత్రి 11 దాటితే ఏటీఎం బంద్

రాత్రి 11గం॥లు దాటితే ఏటీఎం సెంటర్స్ బంద్ కానున్నాయి. రాత్రి వేళలో (రా. 11గం॥-ఉ.6గం॥) తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎంల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఇటీవల సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో చర్చించారు. ఈ నిర్ణయంతో నిర్వహణ భారంతో పాటు స్కిమ్మింగ్‌ వంటి సైబర్‌ నేరాలు తగ్గించడానికి దోహదపడుతుంది భావిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని బ్యాంకర్లు హామీ ఇచ్చారు.

బ్యాంకర్ల ప్రతిపాదనకు సైబరాబాద్‌ పోలీసులు కీలక సవరణలు సూచించారు. ఏటీఎంలను డీ–లింక్‌ చేయడమే కాక పూర్తిగా మూసేయాలని చెప్పారు. రాత్రి వేళలో తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎంల్లో 95 శాతం మారుమూల ప్రాంతాల్లోనే ఉంటాయి. డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల్ని క్లోనింగ్‌ చేసే ముఠాలు ఇలాంటి వాటినే ఎంచుకుంటుంటారు. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గొచ్చు.