5జీ సేవలు మనకెప్పుడు ?
టెక్నాలజీలో పొరుగు దేశాలు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 72 దేశాల్లో 5జీ టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయి. 5జీ నగరాల పరంగా చూసినప్పుడు చైనా తొలి స్థానంలో ఉండగా.. అమెరికా రెండో స్థానంలో ఉంది. అర్జెంటీనా, భూటాన్, కెన్యా, కజకిస్థాన్, మలేసియాలో 5జీ సేవలు ఈ ఏడాదే ప్రారంభమయ్యాయి. ఈ జాబితాలో భారత్ సైతం త్వరలో చేరబోతోంది. త్వరలో 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ (జులై 26) జరగబోతోంది. ఏడాది చివరికల్లా కొన్ని నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
జులై నెలాఖరు కల్లా 5జీ వేలం ప్రక్రియ పూర్తయ్యాక.. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. వేలం పూర్తయిన 6 నెలల్లోగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని గతంలో టెలికాం కంపెనీలు సైతం తెలిపాయి. తొలుత మాత్రం 13 నగరాల ప్రజలు ఈ సేవలను ఆనందించనున్నారు. ఈ జాబితాలో హైదరాబాద్ సహా అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్‌నగర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పుణె నగరాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 4జీ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే 5జీ స్మార్ట్‌ఫోన్ల ధర కాస్త ఎక్కువగా ఉందనే చెప్పాలి. 5జీ ఫోన్ కొనాలంటే కనీసం ₹15వేలు వెచ్చించాల్సిందే.