మరో కాఫీ వివాదం

బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో కాఫీ విత్ కరణ్. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం ఏడో సీజన్ కొనసాగుతోంది. అయితే ఈ షో ఎన్నో వివాదాలను మూటగట్టుకుంది. మరెందరో జీవితాలను బజారున వేసింది. తాజా సీజన్ లో మరో వివాదానికి తెరలేపాడు కరణ్.

ఇటీవ‌ల రిలీజ్ అయిన కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7లో స‌మంత ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ షోలో ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలో నంబ‌ర్‌వ‌న్ హీరోయిన్ ఎవ‌ర‌ని మీరు అనుకుంటున్నారు అంటూ స‌మంత‌ను క‌ర‌ణ్ జోహార్ ప్ర‌శ్నించారు. అత‌డి ప్ర‌శ్న‌కు న‌య‌న‌తార అంటూ స‌మంత స‌మాధానం చెప్పింది. నంబ‌ర్‌వ‌న్ హీరోయిన్ న‌య‌న‌తార‌తో ఇటీవల ఓ సినిమా చేశాన‌ని బ‌దులిచ్చింది.

సమంత ఆన్సర్ ను మ‌ధ్య‌లోనే అడ్డుకున్న క‌ర‌ణ్ త‌న దృష్టిలో న‌య‌న‌తార నంబ‌ర్ వ‌న్ కాదంటూ చెప్పాడు. న‌య‌న్ త‌న లిస్ట్‌లోనే లేదంటూ చెప్పాడు. మీరే నెంబ‌ర్‌వ‌న్ అని తాను అనుకుంటున్నాన‌ని స‌మంత‌తో చెప్పాడు. వీరిద్ద‌రి మ‌ధ్య సాగిన చర్చపై న‌య‌న‌తార అభిమానులు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కావాల‌నే న‌య‌న‌తార‌ను కించ‌ప‌రుస్తూ క‌ర‌ణ్ జోహార్ కామెంట్స్ చేశాడంటూ పేర్కొంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు ఎప్ప‌టికీ న‌య‌న‌తార స్థాయికి చేరుకోలేర‌ని ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.