OTT రిలీజ్ పై ఆంక్షలు.. అసలుకే ఎసరు ?
ఓటీటీలో థియేటర్ల కొంప ముంచుతున్నాయి అంటూ ఓటీటీకి సినిమాలు విషయంలో ఆంక్షలు విధించింది టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్. థియేటర్ లో రిలీజైన సినిమాను 10 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించారు. లో బడ్జెట్ సినిమా అయితే నాలుగు వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. మరిన్ని ఆంక్షలు విధించే దిశగా చర్చలు సాగుతున్నాయి. అయితే వీటి వలన అసలుకే ఎసరు రావొచ్చని సినీ పండితులు అంటున్నారు.
అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో.. ప్రస్తుతం ఓటీటీల ఆధిపత్యాన్ని ఆపలేమని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. కరోనా టైమ్ లో ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. మూసధోరణి కథలు కాకుండా.. వైవిధ్యమైన సినిమాలు/వెబ్ సిరీస్ లను ఓటీటీలో చూసేస్తున్నారు. అది కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి. పెద్దగా ఖర్చు లేకుండా. ఈ నేపథ్యంలో ఇప్పుడు పది వారాలు, నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి సినిమాలు అంటే.. అసలు థియేటర్స్ లో రిలీజయ్యే సినిమాల సంఖ్య తగ్గిపోవచ్చు. నేరుగా ఓటీటీలోకి వచ్చే సినిమాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే స్టార్ హీరో, హీరోయిన్ల సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్నాయి. ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఈ క్రమంలో జాతీయ అవార్డులు అందుకుంటున్నారు.
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఓటీటీలో రిలీజైన కలర్ ఫోటో, ఆకాశమే హద్దుగా సత్తా చాటాయి. ఆకాశమే హద్దుగా సినిమాలో అద్భుతమైన నటనకుగాను సూర్యతో పాటు.. హీరోయిన్ కు జాతీయ అవార్డు లబించింది. ఇక కలర్ ఫోటో ఉత్తమ తెలుగు సినిమా కేటగిరిలో అవార్డు అందుకుంది. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఆంక్షలు అసలుకే ఎసరు తెచ్చే అవకాసాలు ఉన్నాయని అంటున్నారు.