ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర.. సర్పంచ్ భర్త అరెస్ట్
ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నం-12లోని ఆయన నివాసం వద్ద ఆర్మూర్ నియోజకవర్గంలోని కిల్లెడ గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్ ఈ హత్యకు కుట్రపన్నారు. జీవన్‌రెడ్డి ఇంటి వద్ద ఆయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ప్రసాద్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని నుంచి ఓ కత్తి, ఓ తుపాకి స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
గతంలోనూ జీవన్ రెడ్డి హత్యకు కుట్ర జరిగిందనే ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. మరోవైపు, ఇదంతా పొలిటికల్ గేమ్ అనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా సర్పంచ్ భర్త జీవన్ రెడ్డిపై కక్ష పెంచుకొని.. అదను కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.