తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఉప ఎన్నికను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఫ్రీ ఫైనల్ గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడు లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇంతలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరో బాంబు పేల్చారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన భువనగిరిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు.

మునుగోడు తరహాలోనే రాష్ట్రంలో మరిన్ని ఉపఎన్నికలు రాబోతున్నాయని సంజయ్‌ చెప్పారు.కేసీఆర్  ప్రభుత్వంలో తమకు భవిష్యత్‌ ఉండదని భావించే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారని చెప్పారు. ఇక బీజేపీలో టికెట్ల విషయంలో గ్యారంటీ లేదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చేవారికి మాత్రం భాజపాలో స్థానం లేదన్నారు. టికెట్ల విషయంలో ఎవరికీ గ్యారంటీ లేదని.. ఆ విషయాన్ని పార్టీ పార్లమెంటరీ బోర్డే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. పార్టీలో అందరికీ సముచిత గౌరవం ఉంటుందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా సందర్భాల్లో మోదీ, భాజపా పథకాలను ప్రశంసించారని సంజయ్‌ చెప్పారు.