సొంతింట్లో ఉంటే కీడు జ‌రుగుతుంద‌ట‌..! జ్యోతిష్యం వార్త‌ల‌పై స్పందించిన మంత్రి..!!

బెంగళూరులో సొంత ఇంట్లో వుంటే కీడు జరుగుతుందంటూ ఓ జ్యోతిష్కుడు ఇచ్చిన సూచన మేరకు ప్రతి రోజు 350 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారంటూ వచ్చిన వార్తలను కర్ణాటక మంత్రి, సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ కొట్టిపడేశారు. తనకు అధికారిక నివాసాన్ని ఇంకా కేటాయించకపోవడంతోనే తాను ప్రతిరోజు ప్రయాణం చేయాల్సి వస్తోందని చెప్పారు. తనకు ఏ జ్యోతిష్యుడు ఇలాంటి సలహా ఇవ్వలేదని స్పష్టం చేశారు. తనకు అధికారిక నివాసం కేటాయించేంత వరకు ఈ ప్రయాణం చేయ‌క తప్పదన్నారు.

రేవణ్ణ ఎంపిక చేసుకున్న బంగళాలో మాజీ మంత్రి మహదేవప్ప ఉన్నారు. మరో మూడు నెలల పాటు ఆయన అందులోనే ఉండబోతున్నారు. ఆ బంగళాను మహదేవప్ప ఖాళీ చేసేంత వరకు తాను వేచి ఉంటానని రేవ‌ణ్ణ చెప్పారు. హాసన్ జిల్లాలోని హొళెనరసిపుర నియోజకవర్గానికి రేవణ్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేచి, 175 కిలో మీటర్లు ప్రయాణించి బెంగళూరుకు చేరుకుంటారు. పనులన్నీ పూర్తయిన తర్వాత, తిరిగి అర్ధరాత్రికి హొళెనరసిపురకు చేరుకుంటారు. అయితే జ్యోతిష్కులపై కూడా రేవణ్ణకు నమ్మకం ఎక్కువేనంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు.