దాసోజుకు కమలం టికెట్ ఖరారు

ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా ? టికెట్ దొరికిందా.. ? లేదా .. ?? అన్నదే ముఖ్యం అంటున్నరు తెలంగాణ నేతలు. రాష్ర రాజకీయాలు అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వచ్చాయి. టికెట్ల వేట కూడా మొదలైంది. సొంత పార్టీలో టికెట్ ఖరారు అయ్యిందా. అయితే ఒకే. లేదంటే పక్క పార్టీలో ఖర్చీప్ వేసేస్తున్నారు. వెంటనే పార్టీ మార్పుపై ప్రకటన చేసేస్తున్నారు. ఇందుకు ట్రెండీ రీజన్ ఒకటి చెప్పి జంప్ అవుతున్నారు. 
తాజాగా దాసోజు శ్రవణ్ అదే చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే కారణమని ఆరోపించారు.

కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకునేందుకు.. వ్యక్తిగత ఈమేజ్‌ పెంచుకునేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారంటూ దాసోజు విమర్శించారు. ఆయన సొంత ముఠాను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కులం, ధనం ప్రధానం అయ్యాయని పేర్కొన్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఎన్నో నిద్రలేని రాత్రులు గ‌డిపాన‌న్నారు. స‌ర్వేల పేరుతో త‌ప్పుడు నివేదిక‌లు ఇచ్చి మోసం చేస్తున్నార‌న్నారు. రేవంత్ రెడ్డి, సునీల్, మాణిక్కం ఠాగూర్‌లు కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ..సర్వేల పేరుతో రాజకీయ జీవితాల్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 

గత ఎన్నికల్లో దాసోజుకు ఖైరతాబాద్ నుంచి టిక్కెట్ ఇచ్చారు. అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సమయంలో దాసోజు శ్రవణ్‌కు టిక్కెట్‌పై పార్టీ పెద్దల నుంచి హామీ లభించలేదు. దీంతో బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన రేవంత్‌పై రాళ్లేసి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో తన రాజీనామాను రేవంత్ రెడ్డి తీరునే కారణమంటూ ట్రెండీ రీజన్ తనదైన శైలిలో ప్రజెంట్ చేశారు. జంప్ అయ్యారు.