బీజేపీలో చేరితే ‘పీడీ యాక్టు’లా ?
మునుగోడు ఉప ఎన్నిక రాబోతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మునుగోడు నియోజకవర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు భలే డిమాండ్ ఉంది. పార్టీ మారితే.. పది లక్షలు అన్నట్టుగా ఆఫర్ లెటర్ తో అక్కడి నేతలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీజేపీలో చేరే నేతలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెడుతుందని ఈటల రాజేందర్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
“బీజేపీ చేరే నేతలపై పీడీ యాక్టు పెట్టి జైల్లో వేయాలని చూస్తున్నారు. ఇది చాలా దారుణం. వేల సంఖ్యలో ఎంపీటీసీలు, వందల సంఖ్యలో ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్లు, ఎమ్మెల్యేలు భాజపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేసినా భాజపాలో చేరే నాయకులను ఆపలేరు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. టీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు ఎలాంటి కేసులు, వేధింపులు లేవు. చౌటుప్పల్ ఎంపీపీ బీజేపీలో చేరగానే అర్ధరాత్రి ఇంటికి వెళ్లి పోలీసులు వేధిస్తున్నారు. కేసులు పెట్టి భయపెడుతున్నారు” అని ఈటల అన్నారు. ఎన్ని విధాల భయపెట్టిన మునుగోడులోనూ హుజురాబాద్ ఫలితం రిపీట్ అవుతుందన్నారు.