బీజేపీని గెలిపిస్తే అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోతాయి
మునుగోడు ఉప ఎన్నిక మన జీవితాలకు సంబంధించిన ఎన్నిక అన్నారు సీఎం కేసీఆర్. నల్గొండ జిల్లా మునుగోడులో ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. మీటర్లు పెట్టమనే నరేంద్రమోదీ కావాలా? మీటర్లు వద్దనే కేసీఆర్ కావాలా? అని ప్రశ్నించారు. దీనిపై గ్రామాల్లో చర్చ జరగాలి. ఎవరు కావాలో మీరు తేల్చుకోవాలన్నారు.
మునుగోడు చరిత్రలో ఎన్నడూ బీజేపీకి డిపాజిట్లు రాలేదు. బీజేపీకి ఓటు పడిందంటే మన బావి వద్ద మీటరు వస్తది అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీల ఎన్నిక కాదు.. రైతుల బతుకుదెరువు ఎన్నిక అని వివరించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. భాజపా టక్కు టమారా మాటలు చూసి మోసపోవద్దని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఏక్నాథ్ శిందేలాను తీసుకొస్తామని, ఈడీ దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. ఈడీ వస్తే నాకేమైనా భయమా? ఈడీ కాకపోతే బోడీ పెట్టుకోమని చెప్పా. నరేంద్రమోదీ.. నువ్వు గోకినా గోకకున్నా నేను మాత్రం గోకుతూనే ఉంటా. మోడీని ఓడించేందుకు కొత్త శత్రువు అవసరం లేదు.. ఆయన అహంకారమే అతన్ని ఓడిస్తుంది. విద్వేషం పుట్టిస్తే దేశం ప్రమాదంలో పడుతుంది. భాజపాను గెలిపిస్తే అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని సీఎం కేసీఆర్ వివరించారు. సీపీఐ, సీపీఎంతో కలిసి మునుగోడులో బీజేపీని తరిమి కొడదామని కేసీఆర్ పిలుపునిచ్చారు.