బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ కోసం మోసపోవద్దు
బీజేపీ మహిళా నేత విజయశాంతి కి ఇటీవల అలిగిన ఫలితం దక్కింది. ఆదివారం మునుగోడులో బీజేపీ నిర్వహించిన సమరభేరి సభలో ఆమెకు మాట్లాడే అవకాశం దక్కింది. దీంతో అమిత్ షా ముందు రాములమ్మ పౌరుషం చూపించారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చే బీబీసీ (బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ) తీసుకుని మోస పోవద్దని మాజీ ఎంపీ విజయశాంతి మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ ఎనిమిదేళ్లలో ఏం చేశావ్. దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. ప్రతి పేద కుటుంబానికి డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానన్నారు .. ఇవ్వకుండా మోసం చేశారు. ఇందుకోసం సమర్థించాలా? కాళేశ్వరం ప్రాజెక్టు నేనే డిజైన్ చేశాను, నేనే కడుతున్నానని.. వేల కోట్లు అప్పులు తీసుకున్నారు. కానీ, ఆడబ్బంతా జేబులో వేసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కనీస వసతులు కల్పించాలని ఉద్యమం చేస్తే వారిని కూడా మోసం చేశారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారు.. దీనికోసం మిమ్మల్ని సమర్థించాలా? కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు.
మోదీ ఆయనకు శత్రువట.. నిజమే. కానీ, మోదీ ప్రజలకు మాత్రం మంచి మిత్రుడు. ఐటీ, సీబీఐ, ఈడీ వచ్చినా భయం లేదంటున్నారు. ప్రతీ వేదికపై ఇదే చెబుతున్నారు. భయం లేనప్పుడు పదే పదే.. సీబీఐ వస్తే భయంలేదు, ఈడీ వస్తే భయంలేదని ఎందుకు చెబుతున్నారు. లోలోపల మీరు భయపడుతున్నారు కాబట్టే చెబుతున్నారు. ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ చెప్పే మాయ మాటలకు ప్రజలు మోస పోయి గెలిపిస్తున్నారు. నిన్నటి వరకు ప్రత్యామ్నాయ పార్టీ లేదు. అందుకే కేసీఆర్‌ను గెలిపించారు… ఆయన చేసిన అవినీతిని భరించారు. కానీ, ఇవాళ భాజపా ప్రత్యామ్నాయంగా వచ్చేసింది. భాజపాను అధికారంలోకి తీసుకొచ్చి మేలు జరిగే విధంగా చేసుకోండి. కేసీఆర్ ప్రతి ఎన్నికల్లో బీబీసీ (బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ) తీసుకొస్తారు. బీబీసీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. దయచేసి మోసపోవద్దు” అని రాములమ్మ ప్రసంగించారు .