వరద నీటిలో పాక్
పాకిస్థాన్ వరదలతో అల్లాడిపోతోంది. సగానికి పైగా పాక్ భూభాగం వరదను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సింధ్, బలోచిస్థాన్, ఖైబర్ పక్తుంఖ్వాలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలోని 150 జిల్లాల్లో 110 చోట్ల వరదలు వచ్చినట్లు పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) లెక్కలు చెబతున్నాయి.
భారత్తో పోలిస్తే పాక్ లో వర్షపాతం కొంచెం తక్కువగా ఉంటుంది. అక్కడ కూడా నైరుతి రుతుపవనాలు వర్షాలను తీసుకొస్తాయి. జులైలో మొదలై సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ మూడు నెలల్లో 140 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. అత్యధిక వర్షపాతం జులై, ఆగస్టుల్లోనే ఉంటుంది. కానీ, ఈ సారి అక్కడ జూన్ నుంచే వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 1061 మంది చనిపోగా.. 4,52,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. మొత్తం 2,18,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 4,100 కిలోమీటర్ల రోడ్లు, 149 వంతెనలు, టెలికాం, విద్యుత్తు నిర్మాణాలు దెబ్బతిన్నాయి.