దాయాదుల పోరు మరోసారి
ఆసియా కప్ లో భాగంగా గత ఆదివారం ఇండియా – పాకిస్తాన్ తలపడిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో టీమిండియా గెలిచింది. అయితే ఈ ఆదివారం మరోసారి దాయాదుల పోరు జరగనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే సూపర్-4 దశకు టీమ్ఇండియా, అఫ్గానిస్థాన్, శ్రీలంక చేరాయి. శుక్రవారం హాంకాంగ్‌పై 155 పరుగుల భారీ తేడాతో పాక్ విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ 38 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ కూడా సూపర్ – 4 లోకి ప్రవేశించింది.
ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత మ్యాచ్ లో హార్దిక్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోపాటు భువనేశ్వర్ బౌలింగ్ దాడి.. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించడం భారత్‌కు కలిసొచ్చింది. కేఎల్ రాహుల్ మినహా మిగతా బ్యాటర్లు పరుగులు చేశారు. హార్దిక్ (17 బంతుల్లో 33 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. అయితే మరోసారి టీమిండియా ప్లేయర్స్ గ్రౌండ్ లో గర్జించాలని అభిమానులు ఆశ పడుతున్నారు.