ఆ రెండు దేశాన్ని విభజిస్తున్నాయి : రాహుల్

బీజేపీ, ఆరెస్సెస్‌లు దేశాన్ని విభజిస్తున్నాయి. ధరల పెరుగుదలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. వారిని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు రాహుల్ గాంధీ. ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీ పెంపునకు నిరసనగా ‘మెహంగాయి పర్‌ హల్లా బోల్‌’ పేరిట ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు.

‘బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో విద్వేషం పెరిగిపోతోంది. దేశంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. పార్లమెంటులో ప్రజా సమస్యలను లేవనెత్తే వారి గళాన్ని కేంద్రం అణచివేస్తోంది. మీడియా, ఎన్నికల సంఘం వంటి స్వత్రంత్ర వ్యవస్థలపైనా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది’ అంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఇద్దరు, ముగ్గురు వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పని చేస్తుంది. కాంగ్రెస్ సిద్ధాంతాలే దేశాన్ని ప్రగతి పథంలో నడిపించగలవని అన్నారు.