రోజుకు రూ. 1600 కోట్ల ఆదాయం

అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ దేశంలోనే అత్యంత కుబేరుడిగా అవతరించారు.  రూ.10.94 లక్షల కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. ఈ మేరకు 2022కు సంబంధించి భారత్‌లో అత్యంత ధనికుల జాబితాను ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ (IIFL wealth) ప్రకటించింది. సరిగ్గా పదేళ్ల క్రితం ముకేశ్‌ అంబానీలో ఆరోవంతు సంపద కలిగిన అదానీ.. ఇప్పుడు సంపదలో ముకేశ్‌ను దాటిపోయాడు.

గడిచిన ఏడాదిలో గౌతమ్‌ అదానీ సంపద 116 శాతం పెరిగినట్లు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ తెలిపింది. అంటే సగటున రోజుకు రూ.1612 కోట్ల చొప్పున సుమారు రూ5.88 లక్షల కోట్ల మేర సంపద పెరిగిందని పేర్కొంది. దీంతో గడిచిన పదేళ్లుగా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీని గౌతమ్‌ అదానీ దాటేశారు. ముకేశ్ అంబానీ రెండో స్థానంలో ఉన్నారు.

ఇక  సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత సైరస్‌ ఎస్‌ పూనావాలా మూడో స్థానంలో నిలిచారు. హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడు శివనాడార్‌ (రూ.1,85,800 కోట్లు), డీమార్ట్‌ వ్యవస్థాపకుడు రాధాకృష్ణన్‌ దమానీ (రూ.175,100 కోట్లు), వినోద్‌ శాంతిలాల్‌ అదానీ (రూ.169,000 కోట్లు), ఎస్పీ హిందూజా (రూ.1,65,000 కోట్లు), ఎల్‌ఎన్‌ మిత్తల్‌ (రూ.1,51,800 కోట్లు), దిలీప్‌ సంఘ్వి (రూ.133,500), ఉదయ్‌ కోటక్‌ (రూ.119,400 కోట్లు)ఈ జాబితాలో టాప్‌-10లో నిలిచారు.