కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఖర్గే
అనేక మలుపులు, ట్విస్టుల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ప్రధాన పోటీ దారులు ఎవరు ? అన్నది క్లారిటీ వచ్చింది. ఈ పదవికి పోటీ చేస్తానని అందరికంటే ముందే ప్రకటించిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చివరి నిమిషంలో బరిలో దిగారు. ఈ పదవికి పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ ఖర్గేను కోరినట్లు తెలుస్తోంది. ఖర్గే కూడా నామినేషన్ వేశారు.
గాంధీ విధేయుడిగా పేరున్న ఖర్గేకు హైకమాండ్ మద్దతుతో పాటు పార్టీలో అత్యధికుల అండ ఉంది. అశోక్ గహ్లోత్, దిగ్విజయ్, ముకుల్ వాస్నిక్ వంటి సీనియర్ నేతలు సహా జీ23 నేతలైన మనీశ్ తివారీ, ఆనంద్ శర్మ వంటి వారు కూడా ఖర్గేకే మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన గెలుపు ఖాయమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖర్గేకు మద్దతుగా 30 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతకాలు పెట్టినట్టు తెలుస్తోంది.