శివసేన గుర్తు.. ఇద్దరికీ కాకుండా పోయె
అసలైన శివసేన తమదేనని అందువల్ల పార్టీ గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని కోరుతున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ శిందే వర్గాలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇరువర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో పార్టీ చిహ్నాన్ని ఏ వర్గానికీ కేటాయించకుండా తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో మహారాష్ట్రలో ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అసలైన శివసేన పార్టీ తమదేనని చెబుతూ శిందే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని కోరింది. అయితే, దీన్ని ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. ఠాక్రే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్టు శిండే వర్గానికి అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. శిందే వినతిని పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి అనుమతిచ్చింది. ఇప్పుడు ఈసీ శివసేన గుర్తును తాత్కాలికంగా స్థంబింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.