టీకాంగ్రెస్ పాదయాత్ర.. ! సారథి ఎవరో.. !?
సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. అందులోనూ సీఎం కేసీఆర్ ముందస్తు వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. డిసెంబరులో ఎన్నికలు వచ్చే అవకాశమూ లేకపోలేదన్న అంచనాతో విపక్ష కాంగ్రెస్ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే రెండు విడతల బస్సు యాత్ర చేపట్టిన టీకాంగ్రెస్ గత కొంత కాలంగా బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చింది. అయితే మళ్లీ బస్సు యాత్ర చేపట్టాలా.. లేక పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లాలా అనే విషయంపై టీకాంగ్రెస్ లో చర్చ జరుగుతోందట.
రాజకీయాల్లో పాదయాత్రకు ఉన్న సెంటిమెంట్ అంతా ఇంతాకాదు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు ఏపీలో పాదయాత్ర చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు ఏపీలో జగన్ పాదయాత్ర చేపట్టారు కూడా. అంతలా రాజకీయాల్లో సెంటిమెంట్ గా మారిన పాదయాత్ర కార్యక్రమాన్ని తెలంగాణలో నిర్వహించే అంశంపై టీకాంగ్రెస్ తర్జన భర్జన అవుతోంది.
ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపి పార్టీ నేతలు, కేడర్‌ను చక్కదిద్దే పనిలో పడింది టీకాంగ్రెస్. రాష్ట్రంలో కేడర్‌లో ఉత్సాహాన్ని నింపడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయం పాదయాత్రేనని భావిస్తోందట కాంగ్రెస్. పాదయాత్రను జిల్లాల వారీగా నిర్వహించాలా, లేక రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలా అనే ఆలోచన టీకాంగ్రెస్ ను వెంటాడుతోంది. జిల్లాల్లో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాదయాత్రలు నిర్వహించడం అంతగా ప్రభావం ఉడకపోవచ్చనేది విశ్లేషకుల అంచానా. అయితే రాష్ట్ర స్థాయిలో పాదయాత్ర నిర్వహిస్తే దానికి ఎవరు నేతృత్వం వహించాలన్న దానిపై కాంగ్రెస్ లో స్పష్టత రావడంలేదు.
ఇప్పటికే ప్రచార కమిటీకి చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న రేవంత్ పాదయాత్రకు సారథ్యం వహించినా ఆశ్చర్యపోనవసరం లేదని గుసుగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఉత్తమ్ ఆ అవకాశాన్ని రేవంత్ కు ఇవ్వకపోవచ్చనే చర్చ కూడా సాగుతోంది. ఏదేమైనా గ్రూపు తగాదాలను విడిచి జనంలో క్రేజ్ ఉన్ననేతకు పాదయాత్ర సారథ్యం వహిస్తేనే పాదయాత్ర విజయవంతమవుతుందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని, అంతర్గతంగా విభేదాలు రాకుండా చూసుకోవాల్సినవసరం ఉంది. పార్టీ ముఖ్యులు సమావేశమై ఈ విషయంలో ఒక స్పష్టతకు వచ్చాకే పాదయాత్ర విషయంలో క్లారిటీ లభించే అవకాశాలున్నాయి.