కేసీఆర్ ను కలవాలంటే ఒక ఉద్యమమే
మునుగోడు ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్.. పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు. అదే సమయంలో ప్రజల కోసం ఆ లేఖను విడుదల చేశారు. ఇందులో కేసీఆర్ పై ఉన్న అభిమానం చాటుకుంటూనే… తనకి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఉద్యమ నేతలను పార్టీ అస్సలు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ను కలవాలంటే ఒక ఉద్యమమే అన్నారు. బీసీలు ఆర్థిక, రాజకీయ రంగాల్లో వివక్షకు గురికావడం బాధాకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్పై అభిమానంతో ఇప్పటివరకు పార్టీలో ఉన్నానని.. అభిమానం, బానిసత్వానికి మధ్య చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయని అనిపించింది. వాటిని మీ దృష్టికి తీసుకురావడానికి అవకాశం లేకుండాపోయింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సన్నిహితులు, సహచర ఉద్యమకారులు మిమ్మల్ని కలవాలంటే ఒక ఉద్యమమే చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఒక మాజీ ఎంపీ అయినప్పటికీ.. నాతో ఒక్కసారి కూడా సంప్రదించలేదు. ఆత్మగౌరవ సభలకు సమాచారం ఇవ్వకున్నా.. అవమానాలను దిగమింగాను. ఆ విషయం మీకు తెలిసి మౌనంగా ఉన్నారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికలో నా అవసరం పార్టీకి లేదని అనిపించింది. అందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
మరోవైపు బూర బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో ఆయన చర్చలు జరిపారని సమాచారం. అతి త్వరలోనే ఆయన కమలం తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.