అశ్విన్ తెలివైన పని.. కోహ్లీ ప్రశంసలు
ఆదివారం జరిగిన దాయాదుల పోరు గురించి ప్రేక్షకులు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ గురించి విశ్లేషణలు చేస్తున్నారు. నో బాల్ పై విపరీతమైన చర్చ జరుగుతోంది. కోహ్లీ వీరవిహారం గురించి ఎంత చెప్పిన తక్కువే అంటున్నారు. మరోవైపు అశ్విన్ తెలివైన పనిని మెచ్చుకుంటున్నారు. ఆఖరి 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్.. ఏ మాత్రం అత్యుత్సాహం చూపించలేదు. తాను ఎదుర్కొన్న తొలి బంతి వైడ్ గా పడటం గుర్తించి వదిలేశారు. దీంతో.. ఆఖరి బంతికి ఒక పరుగు మాత్రమే అవసరం అయింది. ఇక ఆఖరి బంతిని ఫీల్డర్ల బయట ఎత్తేసి గెలుపు ఖాయం చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై విరాట్ కోహ్లీ స్పందించారు. తీవ్రమైన ఒత్తిడి ఉన్నా అశ్విన్ ప్రశాంతంగా ఆడి జట్టును విజయంవైపు నడిపించిన తీరును కొనియాడాడు. గెలుపు దాదాపు ఖరారైన సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించకుండా నిలకడగా ఆడటమే కాకుండా తెలివైన నిర్ణయాన్ని అమలు చేశాడని అన్నాడు. 15-16 పరుగుల లక్ష్యం ఒక్కసారిగా 2 బంతుల్లో 2 పరుగులకు తగ్గిపోతే ఏ ఆటగాడైనా ఊపిరి పీల్చుకుంటాడు. దాదాపు గెలిచేశాం అనుకుని అత్యుత్సాహం ప్రదర్శిస్తాడు. దినేశ్ కార్తీక్ ఔట్ అయిన తర్వాత నేను అశ్విన్‌కు కవర్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఆడాలని చెప్పాను. కానీ అతడు మాత్రం రెండింతలు బుర్రకు పదును పెట్టాడు. వైడ్ అవుతుందని ముందే గమనించిన అశ్విన్.. షాట్‌ను ప్రయత్నించలేదు. బంతిని వదిలేసి లైన్ లోపలికి జరిగాడు. దీంతో గెలవడం మా వంతైందని అన్నాడు.