భోజనంపై భారత ఆటగాళ్లు అసంతృప్తి

టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో టీమిండియా పాక్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. రేపు రెండో మ్యాచ్ నెదర్లాండ్స్ తో ఆడనుంది. ఇందుకోసం గత రెండు, మూడు రోజులుగా టీమిండియా ఆటగాళ్లు జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, ప్రాక్టీస్‌ సెషన్‌ తర్వాత వడ్డించే భోజనంపై భారత ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

కోల్డ్‌ సాండ్‌విచ్‌లతో పాటు ఫలాఫెల్‌ (బీన్స్‌తో ఫ్రై చేసిన వంటకం) వడ్డిస్తుండటంతో కొంతమంది టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఆ భోజనాన్ని తినేందుకు ఇష్టపడటంలేదని తెలుస్తోంది. మంగళవారం ప్రాక్టీస్‌ తర్వాత గ్రౌండ్‌ సిబ్బంది ఆ భోజనాన్ని తీసుకురాగా పలువురు ప్లేయర్లు తినకుండా తిరిగి పంపించినట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. వేడి భోజనాన్ని ఇష్టపడే భారత ఆటగాళ్లు.. ఆ చల్లటి వంటకాలను తినేందుకు ఇష్టపడటంలేదని పేర్కొన్నారు.

ప్రాక్టీస్‌ తర్వాత వేడి పదార్థాలు వడ్డించడంలేదు. సుదీర్ఘ ప్రాక్టీస్‌ తర్వాత కోల్డ్‌ సాండ్‌విచ్‌ తినలేకపోతున్నారు. అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారమే వారు అందరికీ ఒకే రకమైన భోజనం అందిస్తున్నారన్న విషయం తెలుసు. కానీ భారతీయుల భోజన అలవాట్లకు తగినట్లు వేడిగా ఏదైనా వడ్డిస్తే బాగుంటుంది’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.