ఎమ్మెల్యేల కొనుగోలు : మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. కేటీఆర్ ట్వీట్
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది అంటూ నిన్న రాత్రి హడావుడి చేసిన టీఆర్ ఎస్ పార్టీ.. ఈరోజు సైలెంట్ అయిపోయింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టలేదు. దీంతో.. రకరకాలు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి చేశారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాసుకొచ్చారు.