ట్విట్టర్ ఎలాన్ మస్క్ సొంతం.. వారికి ఉద్వాసన !
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సొంతమైంది. 44 బిలియన్ డాలర్లు విలువ చేసే కొనుగోలు ఒప్పందాన్ని మస్క్ గురువారం పూర్తి చేశారు. ఒక్కో షేరుకు 54.20 డాలర్లు చెల్లించి దాన్ని హస్తగతం చేసుకున్నారు. ఏప్రిల్‌లోనే ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నప్పటికీ.. దాదాపు 6 నెలల తర్వాత అది కార్యరూపం దాల్చింది.
ఇక ట్విటర్‌ను సొంతం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల్ని తొలగించేశారు. సీఈఓ పరాగ్ అగర్వాల్ లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె, 2012 నుంచి కంపెనీలో కొనసాగుతున్న జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్ ఉద్వాసనకు గురైన వారిలో ఉన్నారు. రుణాల కోసం బ్యాంకర్లతో జరిపిన చర్చల్లో కంపెనీని లాభాల్లోకి తీసుకురావడానికి దాదాపు 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తామని చెప్పినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది.