ఎమ్మెల్యేల కొనుగోలు : డిఫెన్స్ లో టీఆర్ఎస్ ?

ఢిల్లీ గద్దలు తెలంగాణలో వాలాయి. వందల కోట్ల ఆశజూపి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించాయని టీఆర్ఎస్ ఆరోపించింది. బుధవారం రాత్రి ఈ ఏపీసోడ్ ను రక్తి కట్టించారు. గురువారం తెల్లారి నలుగురు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహిమ్చనున్నారు. దీంతో.. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారనుంది అనే వార్తలు వినిపించాయి. అయితే వచ్చింది ఢిల్లీ గద్దలు కాదు. తెలంగాణ గద్దలు, టీఆర్ ఎస్ గద్దలు అనే అనుమానాలు క్రమంగా బలబడుతున్నాయి. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ లో లొసుగులు కనిపిస్తున్నాయి. దీనిపై బీజేపీ ప్రశ్నలు సంధించింది. మరోవైపు నిందితులను రిమాండ్ కు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. 41 సీఆర్ పీ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని పోలీసులను ప్రశ్నించింది. 41 నోటీసులు ఇచ్చిన తర్వాతే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవాలని సూచించింది. 


మరోవైపు ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ సైలెంట్ అయిపోగా.. బీజేపీ దూకుడు చూపిస్తుంది. నిన్న కిషన్ రెడ్డి సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఈ కేసు విషయంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఎదుట ప్రమాణం చేద్దాం రావాలని కోరారు. చెప్పినట్టుగానే ఆయన మునుగోడు నుంచి యాదాద్రికి వస్తున్నారు. వచ్చే ముందు మరోసారి మీడియతో మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ వైఖరిని ఎండగట్టారు.  

ఉపఎన్నిక వేళ మునుగోడులో ఏదో చేయాలనుకున్నారు.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇంకేదో చేద్దామని ప్రయత్నించారు. ఈ రెండు సందర్భాల్లోనూ వాళ్లు అనుకున్నది జరగలేదన్నారు సంజయ్. ఇక దిల్లీ అంటారేమో.. అక్కడా వారు ఏం చేయలేరు. ఎవరో ఎమ్మెల్యేలను కొనాలని చూశారు.. డబ్బు దొరికింది అని ప్రచారం చేస్తున్నారు. కొనుగోలుకు కుట్ర జరిగిందని చెప్పి ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు. అదే నిజమైతే పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు ఎక్కడ ఉంది? ఎలాంటి కుట్ర జరిగింది? అలా జరిగితే అందులో భాజపా ప్రమేయం ఏ మేరకు ఉంది? అనే విషయాలను ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర చెప్పాలి. ఏయే నేతలకు ఇందులో ప్రమేయం ఉందో తెలపాలని బండి డిమాండ్ చేశారు.