అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సామ్ నే పంచుకున్నారు. తాను ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ‘యశోద’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేస్తూ సుదీర్ఘ పోస్ట్ చేశారు.
“యశోద’ ట్రైలర్‌కు మీ స్పందన చాలా బాగుంది. జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలల నుంచి ‘మయోసైటిస్’ (Myositis) అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నా. కానీ, నేను అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. అన్నిసార్లూ బలంగా ముందుకు వెళ్లలేమని నాకు తత్వం బోధపడింది. ప్రతిదీ స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తా. త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. అలాంటి పరిస్థితులను ఇంకొక్క రోజు కూడా భరించలేనేమో అనుకున్నా సందర్భాలున్నాయి. కానీ, ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఐ లవ్ యూ” అని సమంత రాసుకొచ్చారు.