సూపర్ కృష్ణ.. తీరని మూడు కోరికలు !
సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. హార్ట్ ఎటాక్ తో ఆదివారం అర్థరాత్రి దాటాక హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరిన ఆయన.. మంగళవారం తెల్లవారుజామున 4:09 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఇండస్ట్రీ, ఆయన అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. అభిమాన నటుడ్ని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. కృష్ణ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
ఈ సందర్భంగా కృష్ణ సాధించిన విజయాలు, ఆయన గొప్పదనం గురించి నెమరు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కృష్ణ తీరని కోరికలు మూడు ఉన్నాయని చెబుతున్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాధారంగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాతో కృష్ణ ఎంతటి సంచలనం సృష్టించారో తెలిసిందే. ఆ తర్వాత ఆయన.. ఛత్రపతి శివాజీ జీవితాధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. స్క్రిప్టు వర్క్ కూడా పూర్తయిందట. కానీ, అది పట్టాలెక్కలేదు. పలు కారణాలతో ఈ ప్రాజెక్టును ఆపేశామని ఓ సందర్భంలో కృష్ణ తెలిపారు.
ఇక మంచి కథ ఉంటే కృష్ణ తన కొడుకు, నటుడు మహేశ్‌బాబు, మనవడు గౌతమ్‌తో కలిసి ఓ చిత్రంలో నటించాలనుకున్నారు. అదీ సాధ్యం కాలేదు. హోస్ట్ గా మారి.. హిందీలో విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లాంటి షోను తెలుగులో చేసేందుకు ఆయన ఆసక్తి చూపారట. ఈ మూడు కృష్ణ జీవితంలో తీరని కోరికలుగా మిగిలిపోయాయి.