అవతార్ 2 నార్త్ లో వీక్.. కారణాలివే !
జేమ్స్ కామరూన్ అద్భుత సృష్టి అవతార్. అవతార్’ కోసం పండోరా అనే కొత్త లోకాన్నే సృష్టించాడు. 2009లో వచ్చిన ‘అవతార్’ ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఇప్పుడీ సినిమాకు పార్ట్-2 సిద్ధమైంది. డిసెంబర్ 16న థియేటర్లలోకి రాబోతుంది.
ఈ సినిమా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగా చాలా ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇటు ఇండియాలో కూడా అవతార్-2 (ది వే ఆఫ్ వాటర్)పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ ఉత్సుకత ఉత్తరాదిన చాలా తక్కువగా, దక్షిణాన చాలా ఎక్కువగా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అవతార్ లాంటి విజువల్ వండర్ ను త్రీడీ, 4డీఎక్స్ లాంటి ఫార్మాట్స్ లో చూసేందుకు దక్షిణాది ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని 4డీఎక్స్+3డీ స్క్రీన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే, అన్ని టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ స్క్రీన్స్ లో 6 రోజుల వరకు ఏ షోకు టికెట్లు అందుబాటులో లేవు. అయితే సౌత్ లో ఉన్న ఊపు నార్త్ లో కనిపించడం లేదు. ముంబయి, ఢిల్లీ, అహ్మదాబాద్, పూణె, కోల్ కతా.. ఇలా ఏ ప్రాంతంలో చూసుకున్నా అవతార్-2కు అడ్వాన్స్ బుకింగ్స్ పేలవంగా ఉన్నాయి. అంకెల్లో చెప్పాలంటే 30-40శాతం మించి అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. కరోనా నుంచి నార్త్ ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణం అని అంతున్నారు.