సంజయ్ ని డామినేట్ చేసిన షర్మిల

మంచో.. చెడో.. మీడియాలో మన పేరు వినిపించాలి. మన గురించి చర్చ జరగాలి. రాజకీయ పార్టీలు, నేతలు పాటించాల్సిన ప్రాథమిక సూత్రమిది. అయితే గత రెండు రోజులుగా తెలంగాణలో మీడియా ఫోకస్ అంతా షర్మిల మీదనే ఉంది. నర్సంపేటలో షర్మిల కాన్వాయ్ పై దాడి.. అరెస్ట్ ఏపీసోడ్ తో మొదలైన హంగామా.. మంగళవారం అర్థరాత్రి వరకు సాగింది. ధ్వంసమైన కారులో షర్మిల ఉండగానే.. ఆమె వెహికల్ ను లాక్కెళ్లడం దాదాపు అన్ని టీవీ ఛానెల్స్ లైవ్ ఇచ్చాయి. ఈ క్రమంలో ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ను కూడా షర్మిల డామినేట్ చేసింది.

అయితే.. ఇదంతా పక్కా స్క్రిప్ట్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. బండి సంజయ్ పాదయాత్ర నుంచి ప్రజల ఫోకస్ ను టర్న్ చేసేందుకు టీఆర్ఎస్ కావాలని వైఎస్ షర్మిలకు కల్పించిన స్కోప్ అని అంటున్నారు. అయితే కారణం ఏదేమైనా.. సోమ, మంగళవారం.. ఈ రెండ్రోజులు తెలంగాణలో షర్మిల టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారని చెప్పవచ్చు. ఇక మంగళవారం ఏపీసోడ్ నేపథ్యంలో షర్మిల, ఆమె పార్టీ నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వారికి సొంత పూచికత్తు కూడిన బెయిల్ ని మంజూరు చేసింది కోర్టు.