సీబీఐ కి కవిత లేఖ.. కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని విజ్ఞప్తి
సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నుంచి పిలుపొచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో నమోదుచేసిన ఆర్‌సీ 53(ఎ)/2022 కేసులో దర్యాప్తు కోసం సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద దిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్ కుమార్ షాహి ఈ నోటీసులు జారీ చేశారు.
“ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోకానీ, దిల్లీలో కానీ మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నాం. మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో దయచేసి తెలియజేయండి” అని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈమేరకు సీబీఐ పంపిన నోటీసుకు కవిత రిప్లై ఇచ్చారు. కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరారు. డాక్యుమెంట్లు అందిన తర్వాత విచారణ తేదీ ఖరారు చేయవచ్చని లేఖలో పేర్కొన్నారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని తెలిపారు.