5G కంటే తల్లిదండ్రులే గొప్ప
అమ్మా-నాన్నల కంటే ఈ ప్రపంచంలో ఏ జీ(5G) ముఖ్యమైనది కాదన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. తల్లిదండ్రుల త్యాగాలను మర్చిపోవద్దని విద్యార్థులకు సూచించారు. గుజరాత్‌లోని పండిత్ దీన్‌దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీలో గతవారం స్నాతకోత్సవం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ముకేశ్ అంబానీ ఈ గొప్ప సందేశమిచ్చారు.
“ఇది మీ రోజు. ప్రపంచానికి మీరెంటో తెలిసే రోజు. కానీ మీరు నిల్చున్నది మాత్రం.. మీ తల్లిదండ్రులు, పెద్దవాళ్ల రెక్కలపైనే. అందువల్ల ఇది వారికి కూడా ప్రత్యేకమైన రోజు. ఈ వేదిక ఎక్కి మీరు గ్రాడ్యుయేషన్ పత్రాన్ని అందుకోవాలని వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అది వారి చిరకాల స్వప్నం కావొచ్చు. మిమ్మల్ని ఇక్కడివరకు తీసుకురావడానికి మీ తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, వారు పడిన శ్రమను ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ విజయం వెనుక వారి సహకారం ఎనలేనిది. మీకు ఎల్లప్పుడూ వారు అండగా ఉంటారు. మీ బలానికి మూలస్తంభాలు వారే. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. ఈ రోజుల్లో ప్రతి యువత 4G, 5G గురించి ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలోనే మాతాజీ, పితాజీ కంటే ఏ ‘G’ ఎక్కువ కాదు. అది గుర్తుపెట్టుకోండి” అని ముకేశ్ అంబానీ యువతకు మార్గనిర్దేశం చేశారు.