కాంగ్రెస్ ను ఊడ్చేస్తున్న ఆప్
వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చీపురు దెబ్బకు విలవిలలాడుతోంది. ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యుడి పార్టీ హస్తం పార్టీకి చావుదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా ఆప్ అధికారాన్ని లాగేసుకుంది. ఆ షాక్ నుంచి కాంగ్రెస్ ఇంకా తేరుకోక ముందే గుజరాత్ లోనూ హస్తం పార్టీకి కేజ్రీవాల్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
తాజాగా వెలువడిన గుజరాత్ ఫలితాల్లో బీజేపీ 150 పైగా స్థానాల్లో బంపర్ మెజారీటీలో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ 20 స్థానాలకు లోపు పరిమితం కానున్నట్లు ప్రస్తుత ట్రెండ్ ను చూస్తే అర్థమవుతోంది. ఇక గుజరాత్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. బీజేపీ, కాంగ్రెస్ హవా ను తట్టుకొని తాము అధికారంలోకి వస్తామని ఎన్నికల ప్రచారంలో ధీమా చెప్పిన కేజ్రీవాల్ పార్టీ కేవలం ఆరు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ ఓటమికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణమైనట్టు తెలుస్తోంది. తద్వారా గుజరాత్ లో బీజేపీ గెలుపుకు ఆప్ సంపూర్ణంగా సహకరించినట్టు అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఆప్ బీజేపీ బీ-టీమ్ అని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆప్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా తయారవుతుందనే విశ్లేషణలు జరుగుతున్నాయి. అది నిజమేనని మొన్నటి పంజాబ్ ఎన్నికలు.. తాజా గుజరాత్ ఎలక్షన్స్ నిరూపించినట్టు అయింది.